కిమ్ ఖాతాలో 99.93% ఓట్లు!: ఉత్తర కొరియా ఎన్నికల్లో ‘నియంత’ ప్రభంజనం.. ఆ 0.07% మంది ఎవరో తెలుసా? – సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం!

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకటించిన వివరాల ప్రకారం, 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ (SPA)కి జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయి ఓటింగ్ నమోదైంది. కేవలం ఒకే అభ్యర్థి పోటీలో ఉండే ఈ ‘రబ్బర్ స్టాంప్’ ఎన్నికల్లో ప్రజలు కేవలం ‘అవును’ లేదా ‘కాదు’ అని మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది.

ఎన్నికల గణాంకాలు:

  • ఓటింగ్ శాతం: దేశవ్యాప్తంగా 99.99 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేవలం విదేశాల్లో ఉన్నవారు లేదా సముద్ర ప్రయాణాల్లో ఉన్నవారు మాత్రమే ఓటు వేయలేకపోయారని తెలిపింది.

  • కిమ్ మద్దతుదారులు: అధికారిక అభ్యర్థులకు అనుకూలంగా 99.93 శాతం ఓట్లు పడ్డాయి.

  • వ్యతిరేక ఓట్లు: విచిత్రంగా ఈసారి 0.07 శాతం ఓట్లు వ్యతిరేకంగా (Reject) నమోదయ్యాయి. గతంలో 100% మద్దతు ఉండేదని ప్రకటించే కిమ్ సర్కార్, ఈసారి పారదర్శకతను ప్రదర్శించేందుకే ఇలా స్వల్ప వ్యతిరేక ఓట్లు ఉన్నట్లు చూపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ 0.07% మంది గతేంటి? (Social Media Fun): ఈ ఫలితాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

“వ్యతిరేకించిన ఆ 0.07 శాతం మంది ఇప్పుడు ఎక్కడున్నారో? భూమి మీద ఉన్నారా లేక పైన ఉన్నారా?” అంటూ మీమ్స్ పేలుతున్నాయి. “కిమ్ తనను తాను డెమొక్రాట్‌గా చూపించుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది” అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

రాజకీయ పరిణామాలు: ఫిబ్రవరిలో జరిగిన 9వ పార్టీ కాంగ్రెస్‌లో కిమ్ ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీగా తిరిగి ఎన్నికయ్యారు. తాజా విజయంతో ఆయన పట్టు మరింత బిగిసింది. అలాగే ఈ ఎన్నికల ద్వారా కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ మరిన్ని కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. మార్చి 22న జరగబోయే అసెంబ్లీ సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర పడనుంది.