
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో ఇబ్బందులు ఉన్నప్పటికీ, భారత్ తన శక్తి వనరులను పటిష్టం చేసుకుందని కేంద్ర పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ మీడియాకు వెల్లడించారు. వినియోగదారులు ఆందోళన చెందవద్దని, ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ ప్రకటనలోని ముఖ్యాంశాలు:
-
40% పెరిగిన ఉత్పత్తి: రిఫైనరీల నుంచి ఎల్పీజీ రికవరీని పెంచడం ద్వారా గత కొద్ది రోజుల్లోనే దేశీయ ఉత్పత్తిని 40 శాతానికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
-
PNG వైపు మొగ్గు: పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లను స్వచ్ఛందంగా వదులుకోవాలని (Surrender) కోరింది. కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కంటే పీఎన్జీకే ప్రాధాన్యత ఇవ్వాలని సిటీ గ్యాస్ సంస్థలను ఆదేశించింది.
-
రాష్ట్రాలకు అదనపు కేటాయింపు: రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 10 శాతం కమర్షియల్ ఎల్పీజీని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఎల్పీజీ నుండి పీఎన్జీకి మారే సంస్కరణలను ప్రోత్సహించే రాష్ట్రాలకే ఈ అదనపు సరఫరా వర్తిస్తుందని షరతు విధించింది.
-
ఇతర ఇంధనాల లభ్యత: దేశంలో క్రూడ్ ఆయిల్, పెట్రోల్ మరియు డీజిల్ నిల్వలు సాధారణంగానే ఉన్నాయని, వీటి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని స్పష్టం చేసింది.
-
డిజిటల్ బుకింగ్స్: గ్యాస్ బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు డిజిటల్ బుకింగ్స్‌ను ప్రోత్సహిస్తున్నామని, ప్రస్తుతం ఆన్లైన్ బుకింగ్స్ 93 శాతానికి చేరాయని పేర్కొంది.
వినియోగదారులకు సూచనలు:
-
పానిక్ బుకింగ్ వద్దు: గ్యాస్ అయిపోకముందే ఆందోళనతో బుక్ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోంది. కాబట్టి అవసరం ఉన్నప్పుడే బుక్ చేయాలి.
-
డీఏసీ (DAC) కోడ్: సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా ‘డెలివరీ అథెంటికేషన్ కోడ్’ను వినియోగించి బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించాలి.
-
ప్రత్యామ్నాయాలు: హోటళ్లు, హాస్పిటల్స్ వంటి వాణిజ్య సంస్థలు పీఎన్జీ కనెక్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

