రేపు పార్లమెంటులో అమరావతి రాజధాని సవరణ బిల్లు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న రాజకీయ, న్యాయపరమైన వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర హోం శాఖ సిద్ధమైంది. ‘ది ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ (అమెండ్మెంట్) బిల్, 2026’ను రేపటి లోక్‌సభ బిజినెస్ లిస్టులో చేర్చారు.

బిల్లులోని ముఖ్యాంశాలు:

  • సెక్షన్ 5 సవరణ: 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5ను సవరించి, అందులో ‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా స్పష్టంగా చేర్చనున్నారు. గతంలో ఇందులో కేవలం ‘కొత్త రాజధాని’ అని మాత్రమే ఉండేది.

  • భౌగోళిక పరిధి: అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని, AP CRDA పరిధిలో నోటిఫై చేసిన ప్రాంతమంతా రాజధాని కిందకే వస్తుందని బిల్లులో వివరణ ఇవ్వనున్నారు.

  • రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ (Retrospective Effect): ఈ చట్టం జూన్ 2, 2024 నుండి అమలులోకి వచ్చినట్లుగా పరిగణించాలని బిల్లులో ప్రతిపాదించారు. అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిన రోజు నుండే అమరావతి రాజధానిగా గుర్తింపు పొందుతుంది.

  • అసెంబ్లీ తీర్మానం: మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుని ఈ బిల్లును రూపొందించింది.