
హైదరాబాద్: బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశం రాజకీయంగా కాక రేపింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు రెండు గంటల పాటు సాగిన తన ప్రసంగంలో ప్రస్తుత ముఖ్యమంత్రి స్థాయిని, ప్రభుత్వ పనితీరును తీవ్రంగా విమర్శించారు.
కేసీఆర్ ప్రసంగంలోని ప్రధానాంశాలు:
-
ప్రభుత్వంపై విమర్శలు: “ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాటలు, కూతలేంటి? ఇది ఒక చిల్లర ప్రభుత్వం” అని రేవంత్ రెడ్డి తీరును తప్పుబట్టారు. రాష్ట్రం బొందలో పడినట్లు ప్రజలు ఆవేదన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.
-
రైతు సమస్యలు: వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, మంత్రివర్గ ఉపసంఘం పేరుతో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. రైతుబంధును నిర్వీర్యం చేసి రైతులను వంచిస్తున్నారని మండిపడ్డారు.
-
బీజేపీపై ఆగ్రహం: తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుబట్టారు. “అదే లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీలు ఉంటే రణరంగంగా మారేది” అని తన పార్టీ పోరాట పటిమను గుర్తు చేశారు.
-
మహిళా రిజర్వేషన్లు: మహిళా బిల్లును బీజేపీ గందరగోళానికి గురిచేస్తోందని, బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసిందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పోరాటానికి పిలుపు: కాంగ్రెస్ తన ‘అభయహస్తం’ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వదిలిపెట్టవద్దని, ప్రజల పక్షాన నిలబడి పోరాటాలను ఉధృతం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

