
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హరీష్ రావు వ్యాఖ్యల్లోని ప్రధానాంశాలు:
-
ఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: కొంతమంది ఐపీఎస్ అధికారులు తమ ఫోన్లను, ఇంటి ముందున్న సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని హరీష్ రావు సంచలన ఆరోపణ చేశారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రత్యేకంగా హ్యాకర్లను రప్పించి నిఘా పెట్టారని పేర్కొన్నారు. “అలాంటి అధికారులు జాగ్రత్త.. మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం” అని అధికారులను హెచ్చరించారు.
-
అక్రమ కేసులు: సోషల్ మీడియా యాక్టివిస్ట్ మన్నే క్రిశాంక్‌తో పాటు ఏడుగురిపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కలేరని, ప్రజలు రేవంత్ రెడ్డి అరాచకాలను గమనిస్తున్నారని చెప్పారు.
-
రైతు సమస్యలు: యాసంగి పంటకు బోనస్ ఇస్తారా? లేదా? అని సీఎంను నిలదీశారు. గతంలో ‘తాలు తీస్తే తోలు తీస్తా’ అని ప్రగల్భాలు పలికిన రేవంత్, ఇప్పుడు రైతు కష్టాలు పట్టించుకోకుండా జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో ఏసీ కింద కూర్చున్నారని విమర్శించారు.
-
ముగిసిన సగం కాలం: “రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాలం సగం ముగిసింది. మళ్ళీ గెలిచేది లేదు.. ఉన్న కొద్ది రోజులైతే మంచిగా పనిచేయండి” అంటూ ఎద్దేవా చేశారు.

