తెలంగాణలో సరికొత్త విప్లవం – పెటా ‘రోబోటిక్ ఏనుగు’ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

రోబోటిక్ ఏనుగు ప్రత్యేకతలు – సాంకేతికత:

  • సజీవ రూపం – సహజ కదలికలు: పెటా సంస్థ రూపొందించిన ఈ రోబోటిక్ ఏనుగు చూడటానికి అచ్చు అసలైన ఏనుగులాగే ఉంటుంది. ఇది కళ్లు ఆర్పడం, చెవులు ఊపడం, తోక తిప్పడం మరియు తన తొండం ద్వారా నిజమైన ఏనుగులాగే శబ్దాలు (గీంకారాలు) చేయగలదు.

  • హింసకు చెక్: ఏనుగులను బంధించి, సంకెళ్లు వేసి, శిక్షణ పేరుతో హింసించే పద్ధతికి స్వస్తి పలికేలా.. పండుగలు, ఉత్సవాల్లో సజీవ ఏనుగులకు ప్రత్యామ్నాయంగా ఈ రోబోటిక్ ఏనుగులను వాడవచ్చని పెటా ప్రతినిధులు పేర్కొన్నారు.

నెహ్రూ జూలాజికల్ పార్కుకు తరలింపు:

అటవీ అధికారుల కీలక ప్రకటన: గుర్రంగుడ ఎకో పార్కులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ రొబోటిక్ ఏనుగును శాశ్వతంగా హైదరాబాద్‌లోని బహదూర్‌పురాలో గల నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు (Nehru Zoological Park – Hyd Zoo) తరలించనున్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.

జూ పార్కుకు వచ్చే సందర్శకులకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు మరియు చిన్నపిల్లలకు జంతు సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు.. వినోదాన్ని పంచేందుకు ఈ రోబోటిక్ ఏనుగును ప్రత్యేక ప్రదర్శనగా అందుబాటులో ఉంచనున్నారు.

సాంస్కృతిక ప్రదర్శనల్లో జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టేందుకు రోబోటిక్ ఏనుగులను ప్రవేశపెట్టిన దేశంలోని అతికొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచిందని ఈ సందర్భంగా పెటా ఇండియా ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.