
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ప్రభుత్వం భారీ మార్పులు చేపట్టింది. 2025 రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా తాజాగా జీవో నంబర్ 45 (GO Ms No 45) జారీ చేసింది. దీని ద్వారా 1975 నాటి పాత నిబంధనలు రద్దయి, కొత్త జోనల్ విధానం మరియు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.
కీలక మార్పులు ఇవే:
-
95% రిజర్వేషన్: ఇకపై అన్ని నేరుగా నియామకం (Direct Recruitment) చేసే ఉద్యోగాల్లో 95 శాతం పోస్టులు స్థానిక అభ్యర్థులకే దక్కుతాయి. గతంలో ఇది జిల్లా స్థాయిలో 80%, జోనల్ స్థాయిలో 70% మాత్రమే ఉండేది. మిగిలిన 5% పోస్టులు మాత్రమే ఓపెన్ కేటగిరీ (ఓపెన్ టు ఆల్) కింద భర్తీ చేస్తారు.
-
కొత్త జోనల్ వ్యవస్థ: రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రాతిపదికన పరిపాలనను సులభతరం చేసేందుకు రాష్ట్రాన్ని 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లుగా విభజించారు.
-
పోస్టుల వర్గీకరణ: ఉద్యోగాల స్వభావం, వేతన స్థాయిని బట్టి పోస్టులను జిల్లా, జోనల్ మరియు మల్టీ-జోనల్ స్థాయిలుగా వర్గీకరించారు.
-
స్థానికత (Local Status) గుర్తింపు: ఒక అభ్యర్థిని స్థానికుడిగా పరిగణించాలంటే, అతను క్వాలిఫయింగ్ పరీక్ష వరకు వరుసగా 4 ఏళ్ల పాటు ఆ జిల్లాలో చదువుకుని ఉండాలి. ఒకవేళ విద్య అభ్యసించకపోతే, తల్లిదండ్రులు ఆ ప్రాంతంలో 4 ఏళ్లు నివాసం ఉండటం ప్రాతిపదికగా తీసుకుంటారు.

